నేతల కంటే అధికారులే ఎక్కువ అవినీతిపరులు

మహబూబ్ నగర్ జిల్లా : అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలనంగా మారారు. ఆయన పదే పదే కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఓ కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆద్వర్యంలో పని చేస్తున్న అధికారులను అనిరుధ్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. వారిని ఏకి పారేశారు. చాలా మటుకు తాము అవినీతి పరులమని పదే పదే ఆరోపణలు, విమర్శలు వస్తుంటాయని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో పొలిటికల్ లీడర్స్ కంటే అత్యంత ప్రమాదాకరంగా అధికారులు తయారయ్యారని సంచలన ఆరోపణలు చేశారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి.
ఈ సందర్బంగా రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు అని బాంబు పేల్చారు. ఆయన చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి. రాజకీయ, అధికార వర్గాలలో చర్చకు దారితీసేలా చేశాయి. తాను ఒక వ్యక్తికి పని చేసి పెట్టమని అధికారిని కోరితే ఆయన నిరాకరించారని అన్నారు. కానీ, సదరు వ్యక్తి ఆ అధికారికి రూ. 15,000 చెల్లించగానే ఆయన ఆ పని పూర్తి చేశారని ఆరోపించారు . అధికారులు లంచాలు తీసుకోవడం వల్లే తమ ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి. రోడ్లు వేసే కాంట్రాక్టర్ల నుంచి అధికారులు 20% కమీషన్లు వసూలు చేస్తుండటంతో వారు పనులు వదిలి పారి పోతున్నారని వాపోయారు. .