newsseals.com
News

ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి కేంద్రం స‌హ‌క‌రించాలి

Posted by: VijayaBhaskar November 19, 2026
newsseals-EatalaRajender

హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని, దీనిని ప‌రిష్క‌రించేందుకు కేంద్ర స‌ర్కార్ స‌హ‌క‌రించాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కోరారు. గురువారం హైటెక్స్ సెంటర్ లో జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 85వ వార్షిక సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ. ప్రతిష్ఠాత్మక IRC సదస్సుకు మన హైదరాబాద్ వేదిక కావడం మా అందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. విశ్వనగరంగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ వైబ్రంట్ సిటీ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇప్పటికే కొంపల్లి, ఎల్బీనగర్, ఆరంఘర్ ఫ్లైఓవర్లు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు. వీటితో పాటు బాలానగర్, కూకట్‌పల్లి, తుర్కయంజాల్ – సాగర్ రోడ్ ఫ్లైఓవర్లను కూడా మంజూరు చేయాలని కోరారు ఎంపీ. అలాగే ‘ట్రిపుల్ ఆర్’ (RRR) ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తే హైదరాబాద్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ అంశాల గురించి ఇప్పటికే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డితో కలిసి ప్ర‌తిపాద‌న‌లు కూడా అంద‌జేశామ‌న్నారు. నితిన్ గడ్కరీ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంలో వారు అత్యంత ప్రో-యాక్టివ్, పాజిటివ్ మినిస్టర్‌గా పేరు తెచ్చుకున్నార‌ని ప్ర‌శంసించారు. పార్లమెంట్‌లో ఏ పార్టీ నాయకుడు రోడ్ల గురించి ఏ ప్రశ్న అడిగినా.. వారి సమాధానాలు విని పూర్తి సంతృప్తి చెందుతారని అన్నారు.