newsseals.com
News

హుస్నాబాద్ పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత‌

Posted by: VijayaBhaskar November 20, 2026
neewsseals-TelanganaGovvt

హైద‌రాబాద్ : రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని మహమ్మదాపురంలో ఉన్న ‘అనభేరి ప్రభాకర్ రావు (తెలంగాణ భగత్ సింగ్) స్మారక పార్కు, హాల్’ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 2.30 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉంద‌న్నారు. త‌న‌ ప్రత్యేక చొరవ , కృషితో ఈ నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధిలో , ఇక్కడి చారిత్రక వారసత్వాన్ని కాపాడటంలో మరో కీలక అడుగు ప‌డ‌నుంద‌న్నారు. తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో విశిష్ట స్థానం కలిగిన వీరుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు, ఆయన పోరాట స్ఫూర్తిని, చరిత్రను భావి తరాలకు అందించేందుకు ఈ నిధులను సాధించానని తెలిపారు.

దసరా పండుగ సమయంలో మహమ్మదాపురంలోని మైసమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆలయం సమీపంలో ఉన్న ఈ స్మారక పార్కు, హాల్ శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి, వాటిని పునరుద్ధరించాలని , పర్యాటకులు, భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు పొన్నం ప్ర‌భాక‌ర్. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (Telangana Tourism Development Corporation) అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, రూ. 2.30 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించార‌ని తెలిపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం నిధులు మంజూరు చేసింద‌న్నారు. ఈ నిధులతో స్మారక పార్కు , హాల్‌ను పునరుద్ధరించి అభివృద్ధి చేయడంతో పాటు, పర్యాటక మౌలిక సదుపాయాలను కల్పిస్తాం అన్నారు.