పరిటాల రవి ఆశయం నెరవేరింది : సునీత
శ్రీ సత్యసాయి జిల్లా : తన తనయుడు పరిటాల శ్రీరామ్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిషత్ తొలి చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల స్పందించారు తన తల్లి , దివంగత పరిటాల రవీంద్ర సతీమణి , రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పరిటాల బి.కె.పార్థసారథిని,చమన్ ను జడ్పీ చైర్మన్లుగా చేశామన్నారు. ఏ జడ్పీ చైర్మన్ పదవి కోసం అయితే పరిటాల రవి ప్రాణాలు పోగొట్టుకున్నారో నేడు జిల్లా నేతలందరి సహకారంతో అదే చైర్మన్ పీఠంపై మా కుమారుడు శ్రీరామ్ కూర్చోవడం ఒక అదృష్టంగా, దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. ఏ లోకాన ఉన్నా రవి ఎంతో సంతోషిస్తారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిటాల అభిమానులు, టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ఇది పండగ రోజు అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్పారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ..ఆకలైనప్పుడు అన్నం పెట్టమంటే పరమాన్నం పెట్టినంత సంతోషంగా ఉందని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అన్నారు. పరిటాల కుటుంబానికి నాకు దశాబ్దాల సాన్నిహిత్యం ఉందన్నారు. అందుకే శ్రీరామ్‌ను బాధ్యతగా ఆహ్వానించి మా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు నుంచి పోటీ చేయించామన్నారు. కదిరి ప్రజలు, కూటమి కార్యకర్తలు శ్రీరామ్‌ను తమ బిడ్డలా గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. ఒకవైపు మా నియోజకవర్గ ప్రతినిధిగా గెలిపించుకోవడం, మరోవైపు నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాకు ప్రథమ పౌరుడిగా నిలబెట్టుకోవడం ఒక డబుల్ బొనాంజా అన్నారు. గత ఏడెనిమిది ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న యువకుడు శ్రీరామ్‌కు ఈ పదవి రావడం, ఎడారిలో ఒయాసిస్ మాదిరిగా కార్యకర్తలందరినీ సేదతీర్చిందన్నారు..
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ..కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీకి చైర్మన్, జనసేనకు వైస్ చైర్మన్ పదవులు కేటాయించామని మంత్రి సవిత అన్నారు. జిల్లాలో ఫైటర్ జెట్ పరిశ్రమ, కియా సెకండ్ ఎక్స్పాన్షన్ ప్లాంట్, సాగునీటి ప్రాజెక్టులతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అభివృద్ధే మా వజ్రాయుధం అని.. పరిటాల వారసుడిగా శ్రీరామ్ సారథ్యంలో జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీరామ్ జడ్పీ ఛైర్మన్ కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు…