పౌర సేవలను మరింత మెరుగు పర్చాలి

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందించే పౌర సేవలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .ప్రభుత్వ సేవల పట్ల ప్రజలకు సానుకూల దృక్పథం ఉన్నప్పుడే మెరుగైన పాలన సాధ్యమవుతుందని అన్నారు. పర్యవేక్షణ ద్వారా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు సీఎం. వివిధ శాఖలకు బాధ్యత వహిస్తున్న వారంతా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని స్పష్టం చేశారు. లేకపోతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. తనకు 70 ఏళ్లు దాటినా తాను రోజుకు 20 గంటలకు పైగా కష్ట పడతానని అన్నారు సీఎం.
తనను కూడా మీరంతా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రతి రోజూ నిర్దేశించిన టైమ్ లైమ్ ను సమీక్షించు కోవాలని పేర్కొన్నారు. లేకపోతే వెనుకబడి పోతారని అన్నారు. దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా అన్ని రంగాలలో మార్చాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశగా అన్ని రంగాలకు చెందిన శాఖల ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. తాను ఎప్పటికప్పుడు మీ పనితీరుపై ఆరా తీస్తుంటానని తెలిపారు. సమావేశానికి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఆర్థిక శాఖ, పురపాలక పరిపాలన, ఇంధన శాఖలు, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.