సంక్షేమ కార్యక్రమాలపై ధనుష్ ఫోకస్

చెన్నై : 2027 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధనుష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ సంఘం విస్తరణకు ప్రణాళికలు తయారు చేయాలన్నాడు. తన ‘నర్పణి ఇయక్కం’ (సంక్షేమ సంఘం)ను తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించాలని ఆదేశించారు. ఈ సంస్థ తన వ్యవస్థాగత జిల్లాల సంఖ్యను పెంచుకోవాలని యోచిస్తోంది. అంతే కాకుండా వచ్చే ఏడాదిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించే అంశంపై కూడా చర్చలు జరుపుతోంది. ఈ సంక్షేమ సంఘం తన వ్యవస్థాగత జిల్లాల సంఖ్యను 58 నుండి 100కు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రాష్ట్రంలోని మొత్తం 38 రెవెన్యూ జిల్లాలను కవర్ చేయాలని భావిస్తోంది.
ఈ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల సమాచారం ప్రకారం, 2027 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయగల వ్యక్తులను, మద్దతుదారులను గుర్తించేందుకు ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ధనుష్ తాను రాజకీయాల్లోకి వస్తానని లేదా ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడతానని ఇంకా ఎక్కడా ప్రకటించలేదు. అయితే, విస్తరణ కోసం అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రాతిపదికగా ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్టోబర్‌లో ధనుష్ నిర్వహించిన రెండు సమావేశాల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 14న కోయంబత్తూర్‌లో జరిగిన మొదటి సమావేశంలో, ఆయన జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించారు. తన అభిమాన సంఘాన్ని అధికారికంగా ఒక ‘సంక్షేమ సంఘం’గా మార్చారు.
సంఘం లేని నియోజకవర్గాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న చోట వాటిని మరింత బలోపేతం చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. అలాగే, మహిళా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా కోరారు. అక్టోబర్ 25న చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో జరిగిన సమావేశానికి ముందు, సంస్థ తన మద్దతుదారుల్లో ఉన్న మహిళలను గుర్తించి, వారిని కూడా ఈ వ్యవస్థలో భాగం చేసింది. సుమారు 25 ఏళ్ల క్రితం సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన 43 ఏళ్ల ధనుష్‌కు, ఈ విస్తరణ ద్వారా తమిళనాడు అంతటా ఉన్న అభిమానులు ఒక స్థానిక విభాగం ద్వారా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది.
ఈ జిల్లా స్థాయి నెట్వర్క్ ద్వారా, కేవలం సినిమాలకు సంబంధించిన పనులకే పరిమితం కాకుండా, ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ అభిమానుల భాగస్వామ్యాన్ని కొనసాగించవచ్చని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. 2031 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల అనుభవం సంపాదించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని ఉద్యమంలోని కొందరు భావిస్తున్నారు.