భక్తి భావంతో శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన

తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం “ఓం నమః శివాయ” పంచాక్షరీ మంత్ర ఘోషతో ప్రతిధ్వనించింది. భక్తుల హర హర మహాదేవ నామ స్మరణల మధ్య స్వామివారికి లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా జరిగింది. ఆలయమంతా ఆధ్యాత్మిక శోభతో, దివ్య కాంతులతో విరాజిల్లింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకం, అలంకారం, అర్చన వైభవంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. త్రిదళాలతో కూడిన పవిత్ర లక్ష బిల్వ పత్రాలతో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆగమోక్తంగా స్వామి వారిని అర్చించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వార్చనను కనులారా వీక్షించి భక్తులు పులకించి పోయారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ చంద్రశేఖర స్వామి వారు, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తులను పుష్పాలంకృతులను చేసి తిరుపతి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాల నడుమ సాగే ఈ ఊరేగింపును దర్శించి భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.