ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై ఆరా

అమరావతి : ప్రభుత్వ పాఠశాలల పనితీరు, బోధన గురించి మహిళలను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం అందరికీ అందుతుందా అని ఆరా తీశారు. అందరికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని మహిళలు వివరించారు. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా అందరితో పాటు లబ్ధి చేకూర్చేలా తల్లికి వందనం పథకం జులైలో అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా ఆర్థిక సాయం నిధులు తల్లుల ఖాతాల్లో జమఅవుతాయని వివరించారు. యువగళం పాదయాత్ర సమయంలో విద్యలో కర్నూలు వెనుకబడి ఉండటాన్ని గమనించానని, ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం అందించాలని అప్పుడే సంకల్పించినట్లు చెప్పారు. ఈ
సందర్భంగా మహిళలు మగ పిల్లలకు కూడా బ్యాడ్ టచ్ గురించి తరగతి గదిలో బోధించాలని, విద్యా సంవత్సరం పూర్తైన తర్వాత పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లు నిర్వహించాలని కోరారు. ఇందుకు చర్యలు తీసుకుంటామని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లకు లైబ్రరీలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. తల్లికి వందనం పథకం కింద అందే ఆర్థికసాయాన్ని పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేస్తున్నట్లు మహిళలు వివరించారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తో నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి విద్యార్థులకు అందజేశాం అన్నారు. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను అందరూ గౌరవించాలని కోరారు లోకేష్.