newsseals.com
News

ప్రతీకూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు

VijayaBhaskar July 22, 2026
newsseals-SudarshanReddy

నిజామాబాద్ జిల్లా : సూపర్ ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. ఈ మేరకు గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై స‌మీక్ష చేప‌ట్టారు. సమావేశానికి ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి, నగర మేయర్ కే.ఉమారాణి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, పొలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎస్పీ రాజేష్ చంద్ర, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, ఆర్.డబ్ల్యూ.ఎస్, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కౌలాస్ నాల, పోచారం, సింగీతం, కల్యాణి, రామడుగు, అలీసాగర్, మంచిప్ప, మాసాని తదితర ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థితి, తాగునీటి సరఫరా తీరుతెన్నులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటలకు అందిస్తున్న ప్రోత్సాహం, విద్యుత్ డిమాండ్ – సరఫరా తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా చర్చించారు. తక్కువ నీటితో ఏయే పంటలను సాగు చేయవచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేయవచ్చు అనే విషయాలను వ్యవసాయ శాత్రవేత్తలతో పాటు, ఆదర్శ రైతులు తమ అనుభవపూర్వక అంశాలను వివరించారు. ఎల్ నినో నేపధ్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక గురించి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్ లు తెలియజేశారు.