newsseals.com
News

పసుపు జెండానే మా బలం..బలగం : నారా లోకేష్

VijayaBhaskar July 28, 2026
newsseals-NaraLokesh

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
పసుపు జెండా, కార్యకర్తలు లేకపోతే వేదికపైన ఉన్న మాకు పదవులు లేనే లేవ‌న్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎత్తిన పసుపు జెండా దించకుండా అహర్నిశలు పార్టీకోసం కష్ట పడింది తెలుగుదేశం కార్యకర్తలు అని పేర్కొన్నారు. టిడిపి స్థాపించిన ముహూర్తబలం అద్భుతమైందని అన్నారు. ఓడిపోయిన దగ్గరే గెలవడం మనకు కొత్తకాదు. టిడిపి లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికిన వారి పరిస్థితి ఏమైందో మీకే బాగా తెలుసు అన్నారు లోకేష్. దివంగత ఎన్టీఆర్ జన్మించిన గొప్పనేల కృష్ణా జిల్లా. మీ పట్టుదల, పౌరుషం వేరు. యువగళం పాదయాత్రలో వచ్చినపుడు తెల్లవారుజామున 4 గంటల వరకు నన్ను నడిపించారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు అర్ధ‌రాత్రి కూడా నాకోసం ఎదురు చూశారు. మీ అభిమానం జీవితాంతం నా గుండెల్లో ఉంటుందన్నారు.

నమ్ముకున్న సిద్ధాంతాల కోసం 226 రోజులు, 3132 కి.మీ.ల మేర నేను చేపట్టిన యువగళం పాదయాత్రను ముందుండి నడిపించింది కార్యకర్తలేన‌ని ప్ర‌శంస‌లు కురిపించారు నారా లోకేష్‌. యాత్రను అడ్డుకోవాలని చూసినపుడు రోడ్డుపైకి వచ్చి నిలబడి వైసిపి సైకోలకు సినిమా చూపించార‌ని కొనియాడారు. పెనమలూరు నియోజకవర్గంలో 10కి ఆరుసార్లు గెలిచాం. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిలబడి పోరాడే వ్యక్తి ఎమ్మెల్యే బోడె ప్రసాద్. సత్యనారాయణ అనే సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్లాను. తన కిడ్నీ దెబ్బతింటే ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేసి కాపాడారని చెప్పారు. మారిన కాలానికి అనుగుణంగా 2025 మహానాడులో ఆరు శాసనాలు చేశాం అన్నారు. అందులో నా మనసుకు దగ్గరైంది కార్యకర్తే అధినేత. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నాం. అన్నారు నారా లోకేష్‌.