ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై కొడుకు షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై స్వంత కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. తన ప్రేమ వివాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడడని మండిపడ్డారు. తనపైనే కాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు చేయించారని సంతోష్ గౌడ్ ఆరోపించారు. రూపారెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. మణికొండలో ఉంటున్న రూపారెడ్డి ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చి గొడవకు దిగారని దీంతో వాళ్లు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపాడు సంతోష్ గౌడ్.
తాను ప్రేమించి, పెళ్లి చేసుకునే విషయాన్ని ముందుగానే తాను తన తండ్రి, తల్లికి, కుటుంబీకులకు తెలియ చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదని, ఆపై తనపై కక్ష కట్టాడని, ఆపై దాడులు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఘటన వెనుక తన తండ్రి హస్తం ఉందని సంతోష్ గౌడ్ ఆరోపించారు. ఇంటిపై దాడి జరిగిందని, ‘డయల్-100’కు సమాచారం అందించానని, అయితే పోలీసులు ఫిర్యాదును సరిగా స్వీకరించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు సంతోష్ గౌడ్. రాజకీయ ఒత్తిడితో నార్సింగి పోలీసులు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించాడు. గత్యంతరం లేకనే తాము మీడియా ముందుకు వచ్చామని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని కన్నీటి పర్యంతం అయ్యాడు.