రాబోయే భవిష్యత్తును నిర్దేశించేది ఏఐనే

చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం సాంకేతికతలు, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ , బయో టెక్నాలజీ వంటి వ్యూహాత్మక సాంకేతికతలు భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలు ,సమాజాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పరిశోధన సమాజానికి ఉపయోగపడినప్పుడే అది తన అత్యున్నత లక్ష్యాన్ని సాధిస్తుంది అని ఆయన అన్నారు. ప్రజల జీవితాలను మెరుగు పరిచే ఆచరణాత్మక పరిష్కారాలుగా పరిశోధన ఫలితాలను మలచు కోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడమే కాదు, భవిష్యత్తును తీర్చిదిద్దేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని ఆయన పట్టభద్రులకు ఉద్బోధించారు. 2014 నుండి ఉన్నత విద్య విస్తరణను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం భారతదేశంలో 1,425కు పైగా విశ్వవిద్యాలయాలు, 54,000 కళాశాలలు, 16,850 స్వతంత్ర విద్యా సంస్థలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే, ఉన్నత విద్యలో మహిళల నమోదు సంఖ్య 2014-15లో 1.57 కోట్ల నుండి 2023-24 నాటికి 2.24 కోట్లకు పెరగడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.