newsseals.com
News

అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Posted by: VijayaBhaskar August 17, 2026
newsseals-NadendlaManohar

అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు తీసుకు రావాలన్నారు. వివిధ అంశాలపై జరిగే చర్చల్లో జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాల‌ని స్ప‌ష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం ఉండటం మూలంగా సభకు హాజరు కాలేక పోతున్నారని తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందించే సూచనలు అనుసరిస్తూ సభా కార్యక్రమాలలో పాలుపంచుకుందామ‌ని సూచించారు. శాసనసభ వర్షకాల సమావేశాలు సోమవారం మొదలైన సందర్భంగా సభలో జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి= మ‌నోహ‌ర్ అసెంబ్లీలోని జేఎల్పీ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఉప ముఖ్యమంత్రి మార్గదర్శకంలో సభలో జనసేన సభ్యులందరం హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాలి. చర్చ సందర్భంగా ప్రతి విషయం మీద లోతుగా అధ్యయనం చేసి సభలో మాట్లాడాలి. అలాగే నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను పరిష్కరించేలా ప్రజల గళం కావాలి. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను సభలో చర్చించేందుకు సమాయత్తం కావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పనిచేయాలి. వివిధ కీలక అంశాల మీద సభలో జరిగే చర్చలో జనసేన పార్టీకి కేటాయించే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మ‌నోహ‌ర్.