newsseals.com
News

గొప్ప యోధుడు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న

Posted by: VijayaBhaskar August 19, 2026
newsseals-BhattiVikramarka

హైద‌రాబాద్ : సామాన్యుడు కూడా త‌లుచుకుంటే ఏదైనా సాధించ గ‌ల‌డ‌ని నిరూపించారు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ అని ప్ర‌శంసించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ , డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు. 17వ శతాబ్దంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కనవచ్చని, అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు సీఎం. ప్రజలను ఏకం చేయడం, గోల్కొండ కోటను జయించడం, ఆదర్శవంతమైన పాలనను అందించడం కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు.

అణచివేతను , బానిసత్వాన్ని తిరస్కరించే మన తెలంగాణ గడ్డపై నేడు మన ప్రజా ప్రభుత్వం అటువంటి మహనీయుల స్ఫూర్తితోనే పనిచేస్తోందని అన్నారు సీఎం. పేదలు, అట్టడుగు వర్గాలు , బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో, తలెత్తుకుని జీవించేలా శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలను అమలు చేస్తోందని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే , సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేసే దిశగా పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి పథంలో మనం కలిసి ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.