ఇంపీరియల్ కాలేజీని సందర్శించిన సీఎం సలహాదారు
లండన్ : తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన కె. రామకృష్ణారావు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇంపీరియల్ కళాశాలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ , వ్యూహాత్మక అనుసంధాన విభాగం (Strategic Engagement Department) ఉపాధ్యక్షురాలైన అమండా వోల్టుయిజెన్, అలాగే దక్షిణాసియా , ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ అంతర్జాతీయ సంబంధాల మేనేజర్ రోసన్నా గిల్లెస్పీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణా రావు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలు , విద్యా రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణతో కలిసి పనిచే యడానికి గల సహకార అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి.
తెలంగాణ లోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లలో స్వల్పకాలిక కోర్సులు , ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని అమండా తెలిపారు. పరిశోధన సహకారం, అలాగే విద్యార్థులు మరియు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాల విషయంలో తెలంగాణతో భాగస్వామ్యం ఏర్పరచు కోవడానికి తమకు ఆసక్తి ఉందని ఆమె వెల్లడించారు. అదే సమయంలో ఈ ఏడాది డిసెంబర్ 7, 8 , 9 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాల్సిందిగా కె. రామకృష్ణారావు ఇంపీరియల్ కళాశాల ప్రతినిధులను ఆహ్వానించారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం (STEM-ESTEEM) , వ్యాపార విద్య రంగాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలలో ఒకటిగా ఇంపీరియల్ కళాశాల గుర్తింపు పొందింది. ఇంతటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థతో భాగస్వామ్య అవకాశాలపై జరిగిన ఈ చర్చలు, రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు మరింత ఊతాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు రామకృష్ణా రావు.