పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తాం

హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తన అంకితభావం కలిగిన కార్యకర్తల కష్టాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు. వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా అవిశ్రాంతంగా పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు సంస్థాగత పదవులలో 70 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు.
ఇందులో NSUI, యూత్ కాంగ్రెస్ , క్షేత్రస్థాయి కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత లభిస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇందులో కొత్త సభ్యులకు కేటాయిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమ కార్యకర్తల కఠోర శ్రమ వల్లే మాకు అధికారం దక్కిందని చెప్పారు. వారి కృషిని కాంగ్రెస్ ఎప్పటికీ మరువదన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.