newsseals.com
DEVOTIONAL

శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

Posted by: VijayaBhaskar August 25, 2026
newsseals-PavitraSamarpana

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనుల వారికి, యోగ న‌ర‌సింహ స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవ మూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.