పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, కాలువ ద్వారా నీటిని విడుదల చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు వంగలపూడి అనిత. పాయకరావుపేటలో 35,000 ఎకరాలకు సాగునీరు అందనుండటం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ఈ జలాలు తాండవ, వరాహ, శారదా నదుల్లోకి ప్రవహించనున్నాయని తెలిపారు.
రైతుల చిరకాల స్వప్నాలను సాకారం చేయనున్న ఈ గోదావరి జలాలకు ఉత్తరాంధ్ర ఘన స్వాగతం పలుకుతోందని అన్నారు వంగలపూడి అనిత . పోలవరం ఎడమ కాలువ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలోని వేలఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రైతులను భాగస్వాములను చేస్తూ నిర్వహించే ఈ చారిత్రాత్మక ‘జలహారతి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లనూ పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం ద్వారా విజయవంతం చేయాలని కోరారు.