newsseals.com
News

క్వాంట‌మ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్ష‌ణ

Posted by: VijayaBhaskar August 28, 2026
newsseals-QuantumAI

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కు తీపిక‌బురు చెప్పింది కేంద్రం. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని కార్య‌క‌లాపాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంట‌మ్ ఏఐ యూనివ‌ర్శిటీ క్యాంప‌స్ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా రానుంది. 8.25 ఎక‌రాల‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల కాలంలో మొత్తం 8,250 మంది లబ్ధి పొందనున్నార‌ని ఈ సంద‌ర్బంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అందులో 1,650 మంది డిగ్రీ-పీజీ కోర్సుల ద్వారా, 6,600 మంది విద్యార్థులు నైపుణ్య సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా శిక్షణ పొందుతారని పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించే శాశ్వత ప్రాంగణాన్ని పర్యావరణ హితంగా, సౌర విద్యుత్, ఈవీ ఛార్జింగ్, నెట్ జీరో లక్ష్యంతో నిర్మిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల ప్ర‌ముఖ సంస్థ‌లు ఏపీకి క్యూ క‌డుతున్నాయ‌ని చెప్పారు. ఇందులో భాగంగానే క్వాంట‌మ్ ఏఐ క్యాంప‌స్ ఇక్క‌డికి వ‌చ్చింద‌న్నారు. క్యాంపస్‌లో 500 మందికి వసతి కల్పించే హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు, విజిటింగ్ ఫ్యాకల్టీ గెస్ట్ హౌస్‌లు నిర్మిస్తామ‌న్నారు . కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూలతో నైలిట్ భాగస్వామ్యం కానుంది. ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ రాకతో అమరావతి సరికొత్త డీప్-టెక్ హబ్ గా మారి, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.