newsseals.com
DEVOTIONAL

నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు

Posted by: VijayaBhaskar February 1, 2026
newsseals-TTDChairmman

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మెన్

తిరుపతి : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్త‌వం కాద‌ని అన్నారు. సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయిందని నాయుడు పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని ఆరోపించారు.

సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని తెలిపారు బీఆర్ నాయుడు. సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని ప‌రీక్షించిన NDDB జంతు కొవ్వు ఉంద‌ని నివేదిక ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని అన్నారు చైర్మ‌న్. నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.