newsseals.com
News

మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

Posted by: VijayaBhaskar February 27, 2026
newsseals-NaraLokesh

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్

అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం జ‌రిగింద‌న్నారు. వాట్సాప్ సర్సీసులపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ… వాట్సాప్ సేవలవల్ల సమయం ఆదా అవుతోందని చెప్పారు. ఎటువంటి ఫీజు లేకుండా సేవలందించడం హర్షణీయం. అయితే యాప్ బాగా స్లోగా ఉండటం వల్ల అందరూ ఉపయోగించు కోలేక పోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇతర యాప్ ల మాదిరి ఒకసారి వివరాలు నమోదుచేశాక మళ్లీ చేసే అవసరం లేకుండా చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఉపయోగించుకునేలా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని కోరారు.

మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… మనమిత్ర ప్లాట్ ఫాంపై మేం ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదని పేర్కొన్నారు. వాట్సాప్ అనేది ఒక హైవే. డేటా డిపార్ట్ మెంట్ వద్ద ఉంటుంద‌ని చెప్పారు . దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రాసెస్ ను డిజిటలైజ్ మాత్రమే చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటి ముంగిటకు వస్తున్నాయన్నారు. అదే బటన్ ద్వారా ప్రజలకు అవసరమైన పౌరసేవలు, సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకు రావాలన్న ఆలోచన నాకు యువగళం పాదయాత్ర సమయంలో వచ్చిందని పేర్కొన్నారు లోకేష్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్దఎత్తున వాట్సాప్ సేవలు అందిస్తున్నాం అన్నారు.