newsseals.com
DEVOTIONAL

విశేష స్థాయిలో సేవలు అందిస్తున్న క్షురకులు

VijayaBhaskar May 29, 2026
newsseals-TTDBarber
Spread the love

వేస‌వి స‌మ‌యంలో తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు

తిరుమ‌ల : వేస‌వి సెల‌వులు ఉండ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ఇదిలా ఉండగా విశిష్ట సేవ‌లు అందిస్తున్నారు క్షుర‌కులు. టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక్కో క్షుర‌కుడు త‌మ విధుల్లో భాగంగా 6 గంట‌ల షిఫ్టులో 40 మందికి క్షర కర్మ చేస్తారు. మ‌రోవైపు పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్ర‌తిరోజూ అద‌నంగా విధులు కేటాయించ‌డంతో ఒక్కో క్షరకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షర కర్మ చేస్తూ నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తున్నారు

భ‌క్తులు అత్యంత ప‌విత్రంగా భావించే క‌ళ్యాణ‌క‌ట్ట‌ల్లో టీటీడీ ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేసింది. భ‌క్తుల‌కు కేటాయించే బ్లేడ్ల‌ను క్షుర‌కులు ముందుగా సోడియం సొల్యూషన్ లో ముంచి ఆ త‌ర్వాత‌ డెటాయిల్ తో శుభ్ర ప‌ర‌చ‌డం జ‌రుగుతోంది. అదేవిధంగా త‌ల‌నీలాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి భ‌ద్ర‌ప‌ర‌చ‌డంతో ఇబ్బంది లేకుండా చేస్తున్నారు టీటీడీ అదికారులు. ప్రతి క‌ళ్యాణ‌క‌ట్ట‌లో భ‌క్తులకు స్నాన‌పు గ‌దుల‌తో పాటు వేడి నీరు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ అనంత‌రం భ‌క్తుల‌కు చంద‌నం బిళ్ల‌ల‌ను కూడా టీటీడీ అందిస్తోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తలనీలాల సమర్పణ కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, టోకెన్ విధానం తదితర ఏర్పాట్లను టీటీడీ మరింత బలోపేతం చేసింది.