newsseals.com
News

స్టీల్ ప్లాంట్ బాధితులకు న్యాయం జరగాలి

Posted by: VijayaBhaskar June 10, 2026
newsseals-YSJagan

ఏపీ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన వైఎస్ జగన్
విశాఖ‌ప‌ట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడిన కార్మికులు, వారి కుటుంబాలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషాదం తీవ్ర బాధాకరమని జగన్ అన్నారు. బాధితుల కుటుంబాలకు న్యాయం, తగిన పరిహారం, ఉపాధి మద్దతు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందని జగన్ తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఐదుగురు కార్మికులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరు 95 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆవేద‌న చెందారు.

స్టీల్ ప్లాంట్ కార్మికుల దుస్థితిపై సమాజం తీవ్రంగా ఆలోచించాలని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వ హయాంలో నెలకొన్న పరిస్థితులతో పోల్చి చూసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని జగన్ గుర్తు చేశారు. ప్రైవేటీకరణతో ముందుకు వెళ్లవద్దని కేంద్రాన్ని కోరుతూ, తమ ప్రభుత్వం 2021 మార్చి 9న, ఆ తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిందని ఆయన తెలిపారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింద‌ని చెప్పారు.