newsseals.com
News

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Posted by: VijayaBhaskar June 22, 2026
newsseals-APCM

ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం అన్నారు. పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాల‌ని అన్నారు సీఎం. సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఉద్యోగుల వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరించాలి. దీని ద్వారా పాలనపై ప్రజల్లో మంచి భావన కలుగుతుంద‌ని చెప్పారు.

మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులు పాలనా పరంగా సామర్ధ్యాలను పెంచుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానం మార్చుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలి. ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరం. పాలనలో సంస్కరణలపై ఉద్యోగులకు, అధికారులకు శిక్షణ ఇప్పించాం. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి పెద్ద టాస్క్ గా ఉండేది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సులభంగా వాటిని క్లియర్ చేయగలిగే పరిస్థితి ఉంది. వినూత్నంగా ఆలోచన చేయకపోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి అని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.