newsseals.com
News

ఏపీలో గంజాయి లేకుండా చేస్తాం

Posted by: VijayaBhaskar June 25, 2026
newsseals-EagleTeamChief

ఈగ‌ల్ చీఫ్ ఆకే ర‌వికృష్ణ ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీలో గంజాయి లేకుండా చేస్తామ‌ని , మాద‌క ద్ర‌వ్యాల వినియోగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఏపీ ఈగ‌ల్ చీఫ్ ఆకే ర‌వికృష్ణ‌. గురువారం ఏపీ ఈగ‌ల్ ఆధ్వ‌ర్యంలో వీఐటీ యూనివ‌ర్శిటీలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘జీరో గంజాయి సాగు’ సాధన నిరంతర అమలు చర్యలు, నిఘా ఆధారిత ఆపరేషన్లు , ప్రజల భాగస్వామ్య ఫలితం వ‌ల్ల వ‌చ్చింద‌న్నారు. మా లక్ష్యం కేవలం చట్ట అమలు మాత్రమే కాదు; యువత జీవితాలను రక్షించడం, సమాజంలో అవగాహన పెంపొందించడం, భవిష్యత్ తరాలను మాదకద్రవ్యాల ముప్పు నుండి కాపాడడం కూడా అని ప్ర‌క‌టించారు.

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై పోరాటంపై విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజంలోని ప్రతి వర్గం కలిసి పని చేయాలని అన్నారు. అవగాహన, అప్రమత్తతే యువత భవిష్యత్తును రక్షించే అత్యంత శక్తివంతమైన ఆయుధాలని పేర్కొన్నారు. ఈగల్ సెల్ ఎస్పీ నాగేశ్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణం , యువతలో ఆరోగ్యకర, బాధ్యతాయుత జీవనశైలిని ప్రోత్సహించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ ఎస్పీ శస్వరూపారాణి, విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర, డా|| ఖదీర్ పాషా డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) తదితరులు పాల్గొన్నారు.