జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు, వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భారీ ఎత్తున నిధులను మంజూరు చేశామన్నారు. పాడై పోయిన కాటన్ బ్యారేజ్ గేట్లను పునరుద్దరించేందుకు రూ. 110 కోట్లు విడుదల చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నీటి పారుదల రంగాన్ని పట్టించు కోలేదని ఆరోపించారు. కానీ తాము వచ్చాక జీవం పోస్తున్నామన్నారు.