సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి

అమరావతి : సాగు నీటి రంగానికి సంబంధించి ఇంజనీర్ కేఎల్ రావు చేసిన కృషి ఎనలేదని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలందించారని చెప్పారు సీఎం. విజయవాడలో జన్మించి ఎంపీగా ఎన్నికై ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పని చేసిన ఘనత తనది అని పేర్కొన్నారు. నీటి పారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారని చెప్పారు.
శివ రామకృష్ణయ్య, కేఎల్ రావుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా నాకు ఎంతో స్పూర్తి అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. జలధార కార్యక్రమంతో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టాం అన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.