రైతల‌ను ఇబ్బంది పెడితే ఊరుకోం

వార్నింగ్ ఇచ్చిన హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ గ‌నుక రైతుల‌ను కావాల‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా ఇష్టారీతిన ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారంటూ సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండల గ్రామాల రైతులు త‌న‌ను క‌లిశారు. తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్‌లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్మెంట్‌ని కొనసాగించేలా ఒత్తిడి తేవాలని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాధిత రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు హ‌రీశ్ రావు. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజక్ట్ అలైన్మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గం అన్నారు.

కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి నెల‌కొంద‌న్నారు. పచ్చటి పొలాల గుండా అలైన్మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారని వాపోయారు హ‌రీశ్ రావు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌తో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంలా మారాయన్నారు. ఉత్తర భాగాన అలైన్మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్నగూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉన్నది ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులే న‌ని అన్నారు. రైతులు భూములు కోల్పోకుండా మొదటగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించింద‌న్నారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ఆర్ఆర్ఆర్ మార్గాన్ని అష్ట వంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపార‌ని ఆరోపించారు హ‌రీశ్ రావు. ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ వరకు 40 కిలోమీటర్లు దూరం ఉండవలసి ఉండగా 23 కిలోమీటర్ల దూరంలో ఆర్ఆర్ఆర్‌ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సొంత భూములకు మేలు కలిగేలా ముఖ్యమంత్రి అలైన్మెంట్ ను అడ్డగోలుగా మార్చడం దుర్మార్గం అన్నారు. గంగారం, శివన్నగూడెం గ్రామంలోని పూర్తి భూమి కోల్పోయి గ్రామం మొత్తం నిర్వాసితులు అవుతున్నారని మండిప‌డ్డారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *