newsseals.com
DEVOTIONAL

అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Posted by: VijayaBhaskar October 14, 2025
newsseals-puspayagaam

29న అన్ని ఆర్జిత సేవ‌లు ర‌ద్దు చేసిన టీటీడీ

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్ప యాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండ‌గా ట‌టీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 29న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది.
30న‌ పుష్ప‌యాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.