newsseals.com
News

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి

Posted by: VijayaBhaskar March 17, 2026
newsseals-YSRCPDharna

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, ఆందోళ‌న

అమ‌రావ‌తి : టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, ఆందోళ‌న‌లు చేప‌ట్టారు . విజయనగరం బాలాజీ జంక్షన్ లో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , మాజీ డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి , ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వివాదాస్పద వ్యక్తి చైర్మన్ గా కొనసాగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ గురించి వచ్చిన ఆరోపణలను పట్టించు కోకపోవడం దురదృష్టకరమని అన్నారు. వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఖండించారు. నిరసన తెలిపిన మహిళలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులపై దాడులు జరగడం, వారిపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకునే వరకు వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వైయస్ఆర్ సీపీ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఆలయాల పవిత్రత దెబ్బతింటోందని విమర్శించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజల పక్షాన వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.