సీఎస్కే ఫ్యాన్స్ మ‌మ్మ‌ల్ని మ‌న్నించండి : సంజు శాంస‌న్

VijayaBhaskar · May 22, 2026
Spread the love

2027 సీజ‌న్ లో స‌త్తా చాటుతామ‌ని ప్ర‌క‌ట‌న

అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ఆశించిన మేర రాణించ‌లేక పోయింది చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు. 14 మ్యాచ్ ల‌లో కేవ‌లం 6 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలుపొందింది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. గెల‌వాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో 89 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ సంద‌ర్బంగా త‌న ప‌ర్ ఫార్మెన్స్ తో పాటు ఇత‌ర ఆట‌గాళ్ల ఆట‌తీరు కూడా మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ఈ సీజన్ మాకు అస్సలు ఆశాజనకంగా ప్రారంభం కాలేదు. ఆరంభంలోనే మేము వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడి పోయాం. కానీ ఆ స్థితి నుండి మా ఆటగాళ్లు పుంజుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం.

దాదాపు ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు, కానీ చివరి మూడు మ్యాచ్‌లలో మా ప్రదర్శన మాత్రం ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నాడు శాంస‌న్. పలువురు ఆటగాళ్లకు గాయాలు కావడం వల్ల కూడా మేము తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా, చివరి మూడు మ్యాచ్‌లలో జామీ ఓవర్‌టన్‌కు అయిన గాయం మా జట్టును బాగా దెబ్బ తీసిందన్నాడు. ఎందుకంటే ఈ ఏడాది అతను అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో మేము చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను సంతోష పెట్టలేక పోయాం, ఒక జట్టుగా ఆందుకు మేము చింతిస్తున్నాం. వచ్చే ఏడాది మేము దీనికంటే ఎంతో మెరుగైన క్రికెట్‌ను ప్రదర్శించి, అభిమానుల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు పూయిస్తామని ఆశిస్తున్నానని అన్నాడు సంజు శాంస‌న్.