newsseals.com
News

కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

VijayaBhaskar May 23, 2026
newsseals-MinisterRamesh
Spread the love

టీవీకే లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న మంత్రి

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నాయ‌కుడు, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో, ప్ర‌చారం సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌ల‌లో, కార్న‌ర్ మీటింగ్ ల‌లో , చివ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో కూడా సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించార‌ని చెప్పారు ర‌మేష్‌.

కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాలకు అల‌వాటుగా మారింద‌న్నారు. టీవీకే లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్నారు. నాకు గానీ, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌కు గానీ కుల గుర్తింపు ఆధారంగా ఓట్లు రాలేదన్నారు ర‌మేష్, ముఖ్యమంత్రి విజ‌య్ నాయకత్వం వల్లే వచ్చాయ‌న్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కుల, మత భేదాలకు అతీతంగా తమ సొంత కుటుంబ సభ్యునిగా భావించారని పేర్కొన్నారు. ఇదే భావన పార్టీ అభ్యర్థులకు, మంత్రులకు కూడా వర్తించిందన్నారు. కుల ప్రాతిపదికన ఏ పదవులూ ఇవ్వలేదన్నారు.