వెంక‌ట నారాయ‌ణ నియాకం సీఎం వ్య‌క్తిగ‌తం

VijayaBhaskar · June 29, 2026
Spread the love


కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వీసీకే ప్రెసిడెంట్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధిగా తాను న‌టించిన సినిమా జ‌న నాయ‌గ‌న్ నిర్మాత వెంక‌ట నారాయ‌ణ‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా నిరస‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌త్యేకించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు విజ‌య్ నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇది పూర్తిగా త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ఆకాంక్ష‌ల‌ను అవ‌మానించ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఈ సంద‌ర్బంగా వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై స్పందించారు ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న వీసీకే ప్రెసిడెంట్ తిరుమాళ‌వ‌న్.

ఆయ‌న త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లిలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా వెంకట నారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సీఎం విజ‌య్ వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డానికి ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్రత్యేక ప్రతినిధి నియామకం అనేది ముఖ్యమంత్రి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత విశ్వసనీయులైన వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టారు. ఇది పరిపాలనలో కార్యనిర్వాహక అధికారాలు కలిగిన పదవి కాదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తనకు నమ్మకమైన వ్యక్తికి దీనిని అప్పగించారు. ఇది ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారం కాకుండా పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో, ఇటువంటి నియామకాలు చేపట్టే అధికారం పార్టీ నాయకుడికి ఉంటుందన్నారు.