సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వనరులను గుర్తించడం ముఖ్యమన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. HMDA, TGIIC ఆదాయ సమీకరణపై ఫోకస్ ఉండాలన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలని అన్నారు.
ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలన్నారు సీఎం. అనుకుంటున్న స్థాయిలో పని చేయాలంటే శాఖల వారీగా డిపార్ట్ మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. AI టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను DBT కి అనుసంధానం చేసుకోవాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేసుకోవాలని అన్నారు సీఎం. ఇందులో ప్రధానంగా భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఊహాజనిత బడ్జెట్ కాదు… వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ ను రూపొందించు కోవాలని దిశా నిర్దేశం చేశారు. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాలన్నారు.















