పోలవరం ప్రాజెక్టులో డీ వాటరింగ్ ప్రారంభం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి మోదీని కలిశారు. సాధ్యమైనంత మేరకు త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన పురోభివృద్ది పనులను పరిశీలించారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్ట్ లో డీ వాటరింగ్ ప్రారంభమైంది. ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1 ప్రాంతంలో జలవనరుల శాఖ, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి డీ వాటరింగ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్ ఈ రెడ్డి రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జి ఎం ఏ గంగాధర్, డీజీఎం మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో డీ వాటరింగ్ కు 240 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా ఏడొందల క్యూసెక్కుల నీటిని తోడేందుకు అవకాశం ఉంది. ఈ మోటార్లలో కొన్ని 88, మరికొన్ని 83.5 హార్స్ పవర్ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. తొలి రోజు 40 మోటార్లను ప్రారంభించారు. అవసరాన్ని బట్టి మిగిలిన మోటార్లను నడుపుతారు. వర్షాకాలం నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఎప్పడికప్పుడు తోడుతారు. రానున్న కాలంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కూడా ఈ సి ఆర్ ఎఫ్ పనులకు ఆటంకం కలగా కుండా డీ వాటరింగ్ చేస్తారు.