newsseals.com
News

అన్నామ‌లై వ్యాఖ్య‌లపై టీవీకే పార్టీ ఆగ్ర‌హం

VijayaBhaskar July 13, 2026
newsseals-TVKSlams

చెన్నై : వి ది లీడ‌ర్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో పొలాచ్చి వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అధికారంలో ఉన్న సీఎం విజ‌య్ టీవీకే పార్టీని ఏకి పారేశారు. అప్పులు చేసుకుంటూ పోతున్నార‌ని, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌పై పెను భారంగా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అయితే త‌న స‌ర్కార్ ను ప‌డి పోనివ్వ‌కుండా మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు. దీనిపై టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆపార్టీకి చెందిన నేత‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొలాచ్చి స‌ద‌స్సులో కె. అన్నామ‌లై త‌మ గురించి చేసిన కామెంట్స్ ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలి వేస్తున్నామ‌ని టీవీకే పేర్కొంది. వి ది లీడ‌ర్స్ సంస్థ ద్వారా “ఆరోగ్యకరమైన, నైతిక రాజకీయాలను” ప్రోత్సహిస్తామని అన్నామలై చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదమైన విషయం అంటూ ఎద్దేవా చేసింది.

ఆయనతో సన్నిహితంగా పని చేసిన వారు కూడా దీనిని అంగీకరించరంటూ మండిప‌డింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అపారమైన సంపదను కూడబెట్టారని, బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని కలిగి ఉన్నారని వార్తలు ఉన్నాయని బాంబు పేల్చింది. అంతేకాకుండా పార్టీలో తన ప్రత్యర్థులను పక్కన పెట్టడమే లక్ష్యంగా తన సొంత పార్టీ సభ్యుల వ్యక్తిగత వీడియోలు , ఆడియో రికార్డింగ్‌లను బయట పెట్టడం ద్వారా అన్నామలై బీజేపీ ‘వార్ రూమ్‌’లను నడిపిన తీరు ప్రజలకు తెలిసిందేన‌ని పేర్కొంది. టీవీకే (TVK) ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా తనను తాను స్వచ్ఛమైన వ్యక్తిగా చూపించు కోవడానికి అన్నామలై చేస్తున్న ప్రయత్నం, ఆయన గురించి పెద్దగా అవగాహన లేని యువతను ఆకర్షించే వ్యూహంలో భాగంత త‌ప్పా మ‌రోటి కాదని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.