రూ. 151 కోట్ల ఖర్చుతో బ్యారేజీ గేట్ల నిర్మాణం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 117 నూతన గేట్ల నిర్మాణ పనులకు నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గోదావరి డెల్టా రైతాంగానికి దీర్ఘకాలిక జల భద్రతను కల్పించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలు రాయిగా నిలవనుందని వెల్లడించారు.
అనంతరం పిచ్చుకలంకలో నిర్వహించిన బహిరంగ సభలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సహచర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా గోదావరి ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో గతంలో ఏలిన వైసీపీ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు . దీని కారణంగా లక్షలాది మంది రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ ఇంకా జగన్ రెడ్డికి బుద్ది రాలేదన్నారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక భారీ ఎత్తున నిధులను నీటి పారుదల రంగానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు సీఎం.