అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ప్రస్తుతం శాసన మండలిలో విప్ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ లకు తీపి కబురు చెప్పింది. వీరికి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు నేతలు పొద్దస్తమానం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో పదోన్నతి కల్పించారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ది పై ఏనాడూ ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇక తాజాగా అద్దంకి దయాకర్ , డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదా కల్పించడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ మరియు డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదాను కల్పించారు. వారి పదవీకాలం పూర్తయ్యే వరకు ఈ హోదా అమలులో ఉంటుందని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి కేబినెట్ హోదా కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.