newsseals.com
News

అమ‌రావ‌తిని కాపాడుకునేందుకు న‌డుం బిగించాలి

VijayaBhaskar July 19, 2026
newsseals-APCM

అమ‌రావ‌తి : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా కూట‌మి స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. పూర్తి పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి సహించబోం అని హెచ్చ‌రించారు. మన ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేలా ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి పనిచేశారు. ఇదే స్పూర్తి కొనసాగాలని కోరారు.
120 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల కింద రూ.15,274 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపనలు చేశామ‌న్నారు.
ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ కింద ఈ పనులు చేపడుతున్నామ‌ని తెలిపారు సీఎం.

మురుగునీటి శుద్ధికి సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, మంచినీటికి ఓవర్ హెడ్ ట్యాంకులు, చెరువులు పునరుద్ధరణ, డ్రైనేజి లాంటి పనుల కోసం వీటిని చేపడుతున్నామ‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్ద్య వ్యవస్థ తీసుకు రావాలన్నదే మా ఆలోచన అని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. త్వరలో 1104 ఇ-ఆటోలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం. 528 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అన్నారు. అలాగే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా రాష్ట్రంలో 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటిలోనూ వ్యర్ధాల వర్గీకరణ మొదలు పెట్టాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ రథం పేరిట వ్యర్ధాలను సేకరిస్తూ రూ.16కోట్లను ఖర్చు చేసి నిత్యావసర సరుకులు ఇచ్చాం అన్నారు.