కిసాన్ క్రెడిట్ కార్డు పై రూ. 5 లక్షలు ఇవ్వాలి
అమరావతి : రైతులకు మేలు చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఇందుకు సంబంధించి సుదీర్ఘ లేఖ రాశారు. కిసాన్ క్రెడిట్ కార్డు పై రూ.5 లక్షల వరకూ వన్ టైమ్ టాప్ అప్ ఇవ్వాలని సీఎం కేంద్ర ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెటింగ్ కోసం ఎన్ఎఫ్డీబీ ద్వారా రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు రొయ్య ఎగుమతులను పెంచేలా సబ్సీడీలు ఇవ్వటంతో పాటు సామర్ధ్యాలను పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
అలాగే ప్రాసెస్ చేయని పొగాకు హెచ్ఎస్ఎన్ కోడ్ 2401 పై జీఎస్టీని 40 నుంచి 28 శాతానికి తగ్గించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలోని లక్షలాది మంది పొగాకు రైతులతో పాటు డీలర్లు, ఎక్స్ పోర్టర్లకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పెంపు వల్ల వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తలెత్తి సకాలంలో రైతులకు చెల్లింపులు చేయటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఆర్ధిక లావాదేవీలు మెరుగవుతాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.