newsseals.com

ఘ‌నంగా తిరునక్షత్ర మహోత్సవం

July 22, 2026 · VijayaBhaskar

రంగారెడ్డి జిల్లా : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళా శాసనములతో శంషాబాద్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాంగణంలో శ్రీ సుదర్శన పెరుమాళ్ “తిరునక్షత్ర మహోత్సవం” మహావైభవంగా జరిగింది. విశ్వశాంతిని, లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా సమతామూర్తి కేంద్రంలో శ్రీ సుదర్శన మహా మంత్ర హోమం ఘనంగా నిర్వహించారు. రుత్విక్కుల వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు, పూర్ణాహుతి, మంగళాశాసనం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.

అనంతరం భక్తులందరికీ తీర్థ, ప్రసాద గోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సుదర్శన జయంతి ఉత్సవాన్ని కళ్లారా తిలకించి, భగవంతుని కృపకు పాత్రులు కావడానికి నగర నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో సమతామూర్తి ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో కిక్కిరిసి పోయింది. భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ఇదిలా ఉండ‌గా స్వామి వారి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. అంత‌కు ముందు తిరున‌క్ష‌త్ర మహోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స‌మ‌తామూర్తి ప్రాంగ‌ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Related News