హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కేసు దర్యాప్తులో భాగంగా డీసీపీ లావణ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)ని సందర్శించి దర్యాప్తును ప్రారంభించారు. ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు చేపట్టింది. ఈ కేసు వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణ సందర్భంగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఉదయ్ కృష్ణ రెడ్డి ఇంకా శిక్షణలో ఉన్నారని పేర్కొంటూ, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోర్టును అభ్యర్థించారు.
అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. తన పిటిషన్లో ఉదయ్ కృష్ణ రెడ్డిపై తప్పుడు ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారని పేర్కొంటూ, ఆ కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును, సీనియర్ పోలీస్ అధికారులు ‘మహిళా భద్రతా విభాగం’ (Women Safety Wing)కు బదిలీ చేశారు. బదిలీ అనంతరం, డీసీపీ లావణ్య వెంటనే రంగంలోకి దిగారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)ని సందర్శించి దర్యాప్తును ప్రారంభించారు. ఉదయ్ కృష్ణ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ శిక్షణ అధికారి (ట్రైనీ ఆఫీసర్) వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఆమె అకాడమీకి వెళ్లారు.





