newsseals.com

సింగ‌రేణి సంస్థ‌ను ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెడ‌తాం

July 25, 2026 · VijayaBhaskar

క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ గుండె చప్పుడు, రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఈరోజు సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, గనిలో బొగ్గు లభ్యత, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించ‌డం జ‌రిగింద‌న్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ సంస్థలు, విదేశీ బొగ్గు దిగుమతులను తట్టుకుని సింగరేణి నిలబడాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు, మట్టి (Overburden) కలవని అత్యంత నాణ్యమైన బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించామ‌న్నారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సింగరేణి, జెన్‌కో యాజమాన్యాలు సంయుక్తంగా ఒక ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించాన‌ని తెలిపారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

కాలంతో పాటు మనమూ మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . సింగరేణి ఇకపై కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా, గ్రీన్ ఎనర్జీ (సోలార్ పవర్), అలాగే సెమీ కండక్టర్ల తయారీకి ఉపయోగపడే క్రిటికల్ , రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణలోకి వేగంగా అడుగులు వేసేలా ప్రణాళికలు రూపొందించాల‌ని అన్నారు. 130 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ, భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Related News