వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ చండికేశ్వర స్వామివార్ల పంచమూర్తులతో తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని దర్శనం చేసుకునే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.