అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సహకార సంస్థ (ఎన్సీసీఎఫ్) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టులను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా ఆగస్టు 1 నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ మేరకు కాకినాడ నుంచే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొదటగా రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేయాలని కేంద్రం సూచించిందని తెలిపారు. దీన్ని కూడా రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో మొదట ప్రవేశపెట్టి, అక్కడి ఫలితాలను పరిశీలిస్తాం అన్నారు. బియ్యం రైసు మిల్లర్ల వద్ద ప్యాకింగ్ అయ్యే దగ్గర నుంచి వినియోగదారుడికి అందే వరకు ట్రేస్ అండ్ ట్రాకింగ్ పకడ్భందీగా ఈ విధానంలో అమలయ్యేలా చూస్తాం అన్నారు. ఆర్.ఎఫ్.ఐ.డి. టాగ్స్ విప్లవాత్మక నిర్ణయంగా నిలిచి పోతుందని పేర్కొన్నారు.
ఇటీవల గుజరాత్ లో పర్యటించినపుడు గాంధీనగర్, అహ్మదాబాద్ లోని ప్రజా పంపిణీలో అమలు అవుతున్న సీబీడీసీ విధానాన్ని పరిశీలించాం అని తెలిపారు మనోహర్. దాన్ని రాష్ట్రంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని భావిస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రాయితీని డిజిటల్ వాలెట్ గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే, వారికి అవసరం అయిన సరకులను వారు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అది వారికి ఆర్థికంగానూ తోడ్పాటునిస్తుందని తెలిపారు. ఈ విధానం మీద రకరకాల అపోహలు, ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతికత వేగం పుంజుకుంటున్న సమయంలో పారదర్శక మార్పులను స్వాగతించాలని పేర్కొన్నారు. దీంతోపాటు చౌకడిపోల డీలర్లకు కూడా కమీషన్ పెరిగేలా, డిజిటల్ వాలెట్ డబ్బులు ప్రజలు వాడుకోగానే కమీషన్ పడేలా కేంద్రం చొరవ తీసుకుంటోందని తెలిపారు మనోహర్.





