పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పార్టీకి తీరని నష్టం

హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలల కోసం బంకర్ బెడ్ల కొనుగోలులో జరిగిన వందల కోట్ల రూపాయల టెండర్ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నించారని గుర్తు చేశారు. ప్రభుత్వం హైకోర్టును తప్పుదోవ పట్టించినా, అనేక ఒత్తిళ్లు ఎదురైనా, వెనకడుగు వేయకుండా ఆయన సాగించిన న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందన్నారు. ఈ కేసులోని అవినీతి ఆరోపణలను గుర్తించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
ఆయన తన జీవితమంతా ప్రజా నాయకుడిగా, ఉద్యమకారుడిగా పోరాడారని కొనియాడారు . ఆయన మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ, అవినీతిపై ఆయన సాగించిన పోరాటం మనందరికీ ఎప్పటికీ గుర్తుండి పోయేలా, ఒక దిక్సూచిలా నిలిచి పోతుందని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఒక రకంగా ఉద్యమ సహచరుడిని కోల్పోవడం పార్టీకే కాకుండా తనకు తీరని నష్టం చేకూర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.