భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఫిదా
అమరావతి : కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామ రాజు భోగాపురం ఎయిర్ పోర్టును శనివారం ప్రారంభించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతంగా, ఆధునిక వసతి సౌకర్యాలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రికి వేలాది మందితో తెలుగు సంస్కృతి , సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగతం పలికారు. ఆయన కళ్లప్పగించి చూశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టును జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం అని ప్రకటించారు. ఓ పక్క సముద్రం మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టి పడుతోందన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం అన్నారు సీఎం.