newsseals.com

విదేశీ భాష‌లు నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదు

August 1, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : విదేశీ భాషలను బోధించడానికి ఆయా దేశాల నుండి ఉపాధ్యాయులను, ఆయా భాషలలో ప్రావీణ్యం ఉన్న స్థానికులతో పాటు నియమించాలని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు విదేశీ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లే, శ్రామిక ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారందరికీ స్కాలర్‌షిప్‌లు అందించే అంశాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలన్నారు. ఒకవైపు చదువుకుంటూ, మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు చేయడం ద్వారా వారికి స్టైఫండ్ లభిస్తుందన్నారు సీఎం. భవిష్యత్తులో వారు చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

ఏటీసీలలో ఈవీ సేవలు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీల వాడకం పెరుగుతున్నందున, వాటికి సర్వీసింగ్ చేయగల వ్యక్తుల అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకం గణనీయంగా పెరుగుతున్నందున, డ్రోన్ టెక్నాలజీ కోర్సు ఉండాలన్నారు. దేశీయంగా, విదేశాలలో నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో హోమ్ నర్సులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

Related News