newsseals.com
News

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి : భ‌ట్టి

Posted by: VijayaBhaskar August 3, 2026
newsseals-Bhatti

హైద‌రాబాద్ : ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తో పాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయాల‌న్న సంక‌ల్పంతో గ‌త 30 నెల‌లుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తూ సింగ‌రేణికి కొత్త ఊపిరి ల‌భిస్తోంద‌ని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వ‌హించిన ఆన్‌లైన్ వేలంలో మ‌ణుగూరు ఏరియా అస్తిత్వానికి అతి కీల‌క‌మైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగ‌రేణికి ద‌క్క‌డం చారిత్ర‌క విజ‌యంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క అభివర్ణించారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని కాపాడు కోవ‌డానికి కొత్త బ్లాక్‌ల‌ను ద‌క్కించు కోవాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. సింగ‌రేణికి అందిస్తున్న స‌హ‌కారం వ‌ల్లే ఈ రోజు ఈ విజ‌యం సాధ్య‌మైంద‌న్నారు.

అస‌లు ప్రారంభం అవుతుందా లేదా తెలియ‌ని స్థితిలో ఉన్న ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు అనుమ‌తులు సాధించేందుకు తానే ఒడిశాకు వెళ్లి అక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌లిసి ఒప్పించాన‌ని, ఫ‌లితంగా ఈ రోజు 36 ఏళ్ల పాటు సంస్థ‌కు బ‌ల‌మైన పునాది వేసే నైనీలో బొగ్గు ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో 2013 లో యూపీఏ హ‌యాంలో మైనింగ్ అనుమ‌తులు జారీ చేసిన తాడిచ‌ర్ల -2 బొగ్గు బ్లాక్‌ను గ‌త బీఆర్ఎస్ పాల‌కులు విస్మ‌రిస్తే తాము అధికారంలోకి వ‌చ్చాక కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రిపి గ‌త నెల రెండో వారంలో మైనింగ్ లీజులు జారీ చేయించామ‌ని అన్నారు. ఈ గ‌ని ద్వారా 336 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు నిక్షేపాల‌ను 45 ఏళ్ల పాటు వెలికి తీయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

తాజాగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వ‌హించిన వేలంలో సింగ‌రేణి పాల్గొని మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ ను ద‌క్కించుకుంద‌ని, గ‌త పాల‌కులు సింగ‌రేణి సంస్థ‌ను వేలంలో పాల్గొన‌కుండా నిరోధించి మ‌న రాష్ట్రంలోని విలువైన బొగ్గు బ్లాక్‌ల‌ను వారి అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర‌లు చేశార‌ని ఆరోపించారు. ,తాము సింగ‌రేణి మ‌నుగడ కోసం వేలంలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వ‌డం వ‌ల్లే ఈ రోజు సింగ‌రేణికి దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత వేలంలో ఒక బ్లాక్ ద‌క్కింద‌ని తెలిపారు. ఇది ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వంలో న‌మోదైన ప్ర‌జా విజ‌యంగా అభివ‌ర్ణించారు.