అత్యవసర సేవల కోసం ‘డయల్ 112’

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు పొందేందుకు గాను నూతనంగా డయల్ 112 అత్యవసర సేవను ప్రారంభించింది. బుధవారం దీనిని స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్. ఈ సేవ ద్వారా ఒకే ఫోన్ కాల్‌తో 18 రకాల అత్యవసర సేవలను పొందవచ్చని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఈ ‘డయల్ 112’ అత్యవసర స్పందన సేవను ప్రారంభించారు.
అత్యవసర సమయాల్లో వేగవంతమైన, సమన్వయంతో కూడిన స్పందనను అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు డీజీపీ. అలాగే ప్రజలు ఒకే అత్యవసర నంబర్ ద్వారా కీలక సేవలను సులభంగా పొందేలా చూసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ పరిధిలో పోలీసు, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవలు వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 112 అత్యవసర సేవల సర్వీసును అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వెల్లడించారు డీజీపీ.